ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు ప్రమాదకర శక్తులుగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభివర్ణించారు. మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లో పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి ప్రపంచమంతా చూశిందని తెలిపారు. పర్యాటక రంగాన్ని దెబ్బతీయడమే కాక, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఈ దాడిని ఉద్దేశపూర్వకంగా నిర్వహించారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించిందని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న శక్తులను చట్టం ముందుకు తీసుకురావాలనే భారత్ నిబద్ధతను యూఎన్ కూడా పునరుద్ఘాటించిందని జైశంకర్ స్పష్టం చేశారు. “ఈ మూడు దుష్టశక్తులపై పోరాటం ఎస్‌సీఓ లక్ష్యాల్లో ఒకటి. ఎలాంటి రాజీ లేకుండా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే సంస్థ సంకల్పంగా చెప్పాలి” అని ఆయన అన్నారు.
ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ స్థిరత, సంక్షేమం కోసం భారత్ శాశ్వతంగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ అభివృద్ధికి ఎస్‌సీఓ సభ్యదేశాలు మరింత మద్దతు ఇవ్వాలని సూచించారు.
అంతర్జాతీయ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం ‘ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (INSTC)’ను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. “ఎస్‌సీఓ సభ్యదేశాలు తమ సామర్థ్యాన్ని కలిపి ముందుకు సాగితే గానీ వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను విస్తరించలేం. రవాణా అవరోధాలపై దృష్టిసారించాలి” అని అన్నారు.
Read More : నిమిష ప్రియకు ఊరట ..మరణ శిక్ష వాయిదా

One thought on “ఎస్‌సీఓ సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు”
Comments are closed.