తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రాజమౌళి దీని రెండు భాగాలను ఒకే భాగంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన దగ్గర నుంచి దీని రన్ టైమ్ కు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని నిడివి 5 గంటలకు పైగానే ఉంటుందని ఒకరు, 4 గంటలు అని మరొకరు పోస్టులు పెడుతున్నారు. దీంతో రకరకాల వార్తలు నెట్టింట షేర్ అవుతున్నాయి. తాజాగా దీనిపై హీరో రానా అలియాస్ భల్లాల దేవ స్పందించారు.
బాహుబలి సినిమాలో భల్లాల దేవ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు రానా. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ పై స్పందిస్తూ.. ఎంత నిడివి ఉన్నా నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ సినిమాలో నటించకుండానే నాకు బ్లాక్ బస్టర్ రానుంది. రాం టైమ్ ఎంతనేది నాకు కూడా చెప్పలేదు. నాలుగు గంటలు అని పోస్టులు పెడుతున్నారు. అంత నిడివి ఉంటే చూస్తారా!. దీని నిడివి కేవలం రాజమౌళికి మాత్రమే తెలుస్తుంది. ఆయన చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. నాకైతే ఆయన ఏం చెప్పలేదు” అని అన్నారు. దీంతో దీని రాం టైమ్ పై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఇది ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకురానుంది.
రానా నిర్మాతగా వ్యవహరించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం జూలై 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. తాను త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నట్లు చెప్పారు. కొత్తపల్లిలో ఒకప్పుడు మంచి కథతో రూపొందిందన్నారు.
Read More : ఈ కంపేరిజన్ చెప్తే ఆడియెన్స్ నన్ను తంతారేమో.. నాగవంశీ

One thought on “అది జక్కన్నకు మాత్రమే తెలుసు – రానా”
Comments are closed.