నిమిష ప్రియకు ఊరట ..మరణ శిక్ష వాయిదా

యెమెన్ లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష తప్పించడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమిష ప్రియకు కాస్త ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఆమె మరణశిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో నిర్ణయించిన ప్రకారం.. జులై 16న ఈ శిక్ష అమలుచేయాల్సి ఉండగా.. చివరి క్షణంలో స్థానిక అధికారులు దీన్ని నిలిపివేసినట్లు సమాచారం.

ఈ కేసు మొదలైనప్పటి నుంచి నిమిష ప్రియకు అన్నివిధాలా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. నిమిష కుటుంబం.. బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేలా ప్రయత్నాలు చేశాం. స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ ఆఫీసుతో నిరంతరం సంప్రదింపులు జరిపాం. అవి ఫలించి మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్ అధికారులు అంగీకారం తెలిపారు అని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నట్లు సమాచారం. బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.6కోట్ల) బ్లడ్ మనీని (క్షమాధనాన్ని) ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే.. నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.

ఈ కేసు పూర్వాపరాలు చూస్తే …

నిమిష ప్రియ నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్ లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు.

ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన నిమిష అది ముగియగానే తిరిగి యెమెన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహదీ దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతో పాటు వేధించినట్లు ప్రియ కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై నిమిష ప్రియ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్ లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు.

One thought on “నిమిష ప్రియకు ఊరట ..మరణ శిక్ష వాయిదా

Comments are closed.