ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. బాటిల్‌లో లభించే త్రాగునీరు (Packaged Drinking Water) మరియు మినరల్ వాటర్‌ను (Mineral Water) ‘హై-రిస్క్ ఫుడ్ కేటగిరీ’ (High-Risk Food Category)గా వర్గీకరించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రజారోగ్య పరిరక్షణే అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.
ఆహార భద్రతపై మరింత కట్టుదిట్టమైన నిబంధనలు
ఈ వర్గీకరణ ద్వారా బాటిల్ నీటిపై మరింత కఠినమైన నాణ్యతా నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తాగునీరు ప్రాసెసింగ్, నాణ్యత పరీక్షలు, స్టోరేజీ, రవాణా వంటి అన్ని దశల్లో కఠిన నియంత్రణలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.
ప్రమాదకరంగా మారుతున్న మినరల్ వాటర్
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఇటీవల మినరల్ వాటర్, ప్యాకేజ్డ్ వాటర్ సేఫ్టీపై పెరుగుతున్న సందేహాలు. కొన్ని బ్రాండ్లలో నీటి నాణ్యత లోపించడం, అనేక సార్లు కలుషితమైన నీరు సరఫరా అవ్వడం వంటి ఆరోపణలు వెలుగు చూశాయి. తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే త్రాగునీరు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది.
సరికొత్త నిబంధనల అమలు
ఈ వర్గీకరణతో పాటు కొత్త భద్రతా ప్రమాణాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్యాకేజ్డ్ వాటర్ ఉత్పత్తిదారులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాగునీరు సరఫరా చేసే సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ప్రజలకు అప్రమత్తం సూచన
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తాగునీరు కొనుగోలు చేసే సమయంలో నాణ్యతా ప్రమాణాలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదం పొందిన ఉత్పత్తుల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ విషయంలో మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశముంది.

One thought on “ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక నిర్ణయం: బాటిల్ వాటర్, మినరల్ వాటర్ ‘హై-రిస్క్’ ఫుడ్ కేటగిరీగా గుర్తింపు”
Comments are closed.