భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి రాజకీయ వర్గాలను విషాదంలో ముంచెత్తింది. 1960వ దశకంలో మీరట్‌లో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాలిక్, ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో కొనసాగారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడిగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా, అలాగే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పలు కీలక పదవులను నిర్వహించారు. కాంగ్రెస్, జనతాదళ్, బీజేపీ వంటి పలు పార్టీలలో తనకంటూ గుర్తింపు సంపాదించారు.
2018–2019 మధ్య జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన మాలిక్, దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టానికి సాక్ష్యులయ్యారు. ఆయన హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆయన చర్చనీయాంశమయ్యారు. జమ్మూకశ్మీర్‌తో పాటు బీహార్, గోవా, మేఘాలయ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా సేవలందించారు. గవర్నర్‌గా ఉన్నప్పటికీ, రైతుల సమస్యలపై ఆయన నిర్భయంగా గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను బహిరంగంగా విమర్శించి సీనియర్ నేతగా తన వైఖరిని చాటుకున్నారు. చివరి రోజుల్లో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక న్యాయం, బడుగు వర్గాల సంక్షేమంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చడం కొనసాగించారు.
Read More : రెండు బస్సుల మధ్య నుజ్జునుజ్జు అయిన ఆటో(video)

One thought on “జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత”
Comments are closed.