ఐర్లాండ్లో భారతీయుడిపై జాత్యహంకార దాడి

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని టాలాట్ ప్రాంతంలో జరిగిన జాత్యహంకార దాడి అక్కడి భారతీయ సమాజంలో భయాందోళనలను రేకెత్తించింది. ఈ నెల 19న సాయంత్రం 6 గంటల సమయంలో అమెజాన్‌లో పనిచేస్తున్న 40 ఏళ్ల భారతీయుడిపై టీనేజర్ల గుంపు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉండగా, స్థానిక మహిళ జెన్నిఫర్ మర్రే వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇది స్పష్టమైన జాత్యహంకార దాడి అని ఆమె పేర్కొన్నారు. మూడు వారాల క్రితమే ఐర్లాండ్‌కు వచ్చిన బాధితుడు ప్రస్తుతం టాలాట్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొంది, ఆదివారం డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనను గార్డా (ఐరిష్ పోలీసులు) హేట్ క్రైమ్‌గా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. “ఇటీవలి కాలంలో టాలాట్ ప్రాంతంలో విదేశీయులపై ఇలాంటి దాడులు పెరుగుతున్నాయి” అని ది ఐరిష్ టైమ్స్ నివేదించింది. ఈ దాడిని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా తీవ్రంగా ఖండిస్తూ, ఇది స్థానిక భారతీయ సమాజంలో భయాన్ని పెంచిందని తెలిపారు.

బాధితుడు దక్ష్, సోషల్ మీడియాలో “ఐర్లాండ్ ఇక సురక్షితం కాదు, ఇక్కడికి రాకండి” అంటూ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఐర్లాండ్‌లో వలసదారులపై పెరుగుతున్న వ్యతిరేక భావనలు, జాత్యహంకార దాడుల నేపథ్యంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై నిరసన తెలుపుతూ, వలసదారులకు సంఘీభావం వ్యక్తం చేయడానికి నేడు టాలాట్‌లో యాంటీ-రేసిజం, ప్రో-మైగ్రెంట్ సంస్థలు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాయి.

Read More : ఒడిశాలో బాలికపై దారుణం: సజీవంగా పూడ్చే యత్నం

One thought on “ఐర్లాండ్లో భారతీయుడిపై జాత్యహంకార దాడి

Comments are closed.