కాళేశ్వరం నివేదికపై హరీష్ రావు సవాల్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజకీయ ఎత్తుగడ అని ఆయన అన్నారు. కేసీఆర్, తనకు నోటీసులు రాకపోయినా, సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు లీకులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వంపై హరీష్ రావు ఆరోపణలు

గోదావరిపై కట్టిన పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలిపోయినా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఒక్కసారి కూడా సందర్శించలేదని హరీష్ రావు ఆరోపించారు. కానీ, మేడిగడ్డ బ్యారేజీ విషయంలో మాత్రం ఎన్నికల ముందు, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు మూడు సార్లు రిపోర్టులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం కమిటీ నివేదిక నిజమైతే, ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు చేసినట్టే అవుతుందని ఆయన పేర్కొన్నారు.

కాళేశ్వరంపై చర్చకు సవాల్

అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ పెట్టాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శాసనసభ వేదికగా ప్రజలకు నిజాలు తెలిసేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు. కాళేశ్వరం కమిటీ నివేదిక ‘ట్రాష్’ లా ఉందని, గతంలో ఇందిరా గాంధీ, చంద్రబాబుపై వేసిన ఇలాంటి కమిషన్ల నివేదికలు ఏవీ కోర్టుల్లో నిలబడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డిపై విమర్శలు

కాళేశ్వరం కూలిపోయిందని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి, అదే ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుండి గందమల్ల ప్రాజెక్టుకు నీళ్లు పంపిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం నీళ్లే గందమల్లకు వెళ్తాయని, అలాంటప్పుడు ఆ ప్రాజెక్టుకు కొబ్బరికాయ ఎలా కొడతారని ఆయన ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నుండి మూసీ నదికి నీళ్లు పంపించడానికి రూ.6,000 కోట్ల టెండర్లు ఎలా ఖరారు చేస్తారని ఆయన రేవంత్ రెడ్డిని నిలదీశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీష్ రావు వ్యాఖ్యలు

ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో రూ.11,000 కోట్లు ఖర్చు చేశామని, 32 శాతం పనులు పూర్తయ్యాయని ఉత్తమ్ చెబుతున్నారని, కానీ 2014 నాటికి కేవలం రూ.3,700 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని, 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదని హరీష్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పటి మంత్రివర్గంలో ఉత్తమ్ ఉన్నా తమ్మిడిహట్టికి అనుమతులు తీసుకురాలేకపోయారని ఆయన విమర్శించారు.