మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన సామాజిక మాధ్యమ వేదికగా జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్.. వైద్య విద్యను కూడా తీవ్రంగా నిర్లక్ష్యం చేశారంటూ మండిపడ్డారు.
“మోదీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయగా, రూ.4900 కోట్ల నిధులు అందించిందని.. అయితే నాలుగేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో కేవలం 15% మాత్రమే ఖర్చు చేశారని” సత్యకుమార్ పేర్కొన్నారు. మిగిలిన నిధులను జగన్ దారి మళ్లించారని ఆరోపించారు.
“పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రలో భాగంగానే జగన్ ప్రభుత్వానికీ అరకొర మౌలిక వసతులతో కళాశాలలను ప్రారంభించారని” విమర్శించారు. పులివెందుల మెడికల్ కాలేజీ కోసం రూ.300 కోట్లు ఖర్చు పెట్టిన జగన్.. మదనపల్లి మెడికల్ కాలేజీ కోసం రూ.500 కోట్లలో కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు.
అన్ని మెడికల్ కాలేజీలు పునాదులకే పరిమితమైపోయాయని, నాలుగేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకమే ఇందుకు కారణమని విమర్శించారు. జగన్ పాలనలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది శాపంగా మారిందని, జీవో 108 ద్వారా పేదలకు అందాల్సిన రూ.15,000 ఫీజును రూ.25 లక్షల దాకా పెంచారని సత్యకుమార్ దుయ్యబట్టారు.
“జగన్‌మోహన్ రెడ్డే వైద్య కళాశాలల్లో ఎలా నాణ్యమైన విద్యను అందించాలో సమాధానం చెప్పాలని” సత్యకుమార్ డిమాండ్ చేశారు.

One thought on “జగన్‌పై మంత్రి సత్యకుమార్ ఫైర్..”
Comments are closed.