సంతమాగులూరులో తండ్రీకొడుకు హత్య కేసు..

ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాత మాగులూరు శివారులో జరిగిన తండ్రీ-కొడుకుల హత్య కేసులో ప్రధాన నిందితుడు గడ్డం అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం అతడిని స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగానే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు వద్ద బుధవారం వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తరలించారు. స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే బైక్‌పై కారును వెంబడించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కిడ్నాప్ చేసిన వారంతా తండ్రీ కొడుకులను సంతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు కలిసి వెంటాడి ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్యలో ఉపయోగించిన టీజీ 08కె 2345 నంబరు కలిగిన స్కార్పియో కారును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు ఆసుపత్రిలో కన్నీరుమున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. హత్య వెనుక ఉన్న పూర్తి నేపథ్యాన్ని వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More : అతనికి 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పా? సుప్రీంకోర్టు ఆశ్చర్యం

One thought on “సంతమాగులూరులో తండ్రీకొడుకు హత్య కేసు..

Comments are closed.