రైతులకు శుభవార్త: రేపటి నుండి రైతు భరోసా నిధుల జమ

తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించి, జిల్లా నేతలతో ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

వైద్య కళాశాలల్లో మౌలిక వసతులపై ముఖ్యమంత్రి సీరియస్

రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) 26 కళాశాలల్లో సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష చేపట్టారు.

ఈ నేపథ్యంలో న్యాయ మండలి ఆదేశాల ప్రకారం, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లను ఈ నెల 18న ఢిల్లీకి రావాలని సూచించింది. కళాశాలల ప్రిన్సిపాల్స్ వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిస్థితి అంచనా వేసి నివేదిక సమర్పించేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. రాబోయే మూడేళ్లలో అవసరమైన వసతులను సమకూర్చేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తానే జేపీ నడ్డాతో మాట్లాడి త్వరితగతిన ఆమోదం తీసుకొస్తానని సీఎం హామీ ఇచ్చారు.

నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సూచించిన సీఎం.. “జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి” అని పేర్కొన్నారు. ఇకపై వైద్య, విద్యాశాఖలపై ప్రతి నెల మూడో వారంలో సమీక్ష నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

Read More : ఏసీబీ విచారణలో కేటీఆర్ స్టేట్‌మెంట్ నమోదు…

One thought on “రైతులకు శుభవార్త: రేపటి నుండి రైతు భరోసా నిధుల జమ

Comments are closed.