వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తిరుమల గోశాల ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఎద్దేవా చేశారు. ‘‘మీకు, మీ అన్నకు పదవులు, ప్యాకేజీలు ఇస్తే చాలు… మీ నోరు పెగలదా?’’ అంటూ రోజా మండిపడ్డారు.
తన సంభాషణలో రోజా, పవన్ కల్యాణ్‌ను నిలదీయుతూ — ‘‘సనాతన ధర్మం గురించి బహిరంగంగా మాట్లాడే మీరు… తిరుమలలో జరుగుతున్న అపరాచాలు, ఘోరాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికైనా మీకు ధైర్యం లేదా?’’ అంటూ బీజేపీ, జనసేన కూటమిపై ధ్వజమెత్తారు.
‘‘సనాతన ధర్మంలో గోమాతలను పూజిస్తారు. అయితే, తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు చనిపోతున్నా — మీరు ఎందుకు స్పందించడం లేదు? గోశాల పరిస్థితిని బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెడతామని చెప్పడం ఎంతవరకు సమంజసం?’’ అంటూ రోజా ప్రశ్నించారు.
గోశాలలో గోవుల మరణాలకు అసలు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల దేవస్థానాన్ని రాజకీయ స్వార్ధానికి వాడుకుంటున్న కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఈ ఘటనలో పవన్ కల్యాణ్ కూడా పాలుపంచుకున్నాడని’’ ఆరోపించిన రోజా, ఆయనపై వాడిగా విమర్శలు చేశారు. ‘‘ఏడు కొండల మెట్లు కడగడం మొదట పవన్ చేయాలి’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇక గోశాల ఘటనను బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గోశాలలో జరుగుతున్న దురదృష్టకర పరిస్థితిని ప్రజలకు తెలియకుండా ఆపడం శాశ్వతంగా కుదరదు. దేవుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అంటూ హెచ్చరించారు.
ఈ సందర్భంగా రోజా తిరుమలలో గోశాల వద్ద భూమనతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. భూమనపై పోలీసులు విధించిన షరతులను కూడా ఆమె తప్పుబట్టారు. తిరుమల గోశాలలో గోవుల మరణాల అంశం, ప్రభుత్వం తీరుపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
Read More : విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాలేకపోయారు

2 thoughts on “పవన్‌పై రోజా విరుచుకుపాటు!”
Comments are closed.