తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక కీలక కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలంటూ 2020లో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో, ధర్మాసనం తుది తీర్పును రిజర్వులో ఉంచింది.
వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 127లో ఉన్న 31 ఎకరాల భూమిపై ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డితో పాటు మరికొంతమందికి మధ్య న్యాయపోరాటం సాగుతోంది. 2016లో ఈ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారని, అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇది జరిగిందని, తనను కులం పేరిట దూషించారని సొసైటీ ప్రతినిధి ఎన్. పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సంఘటన సమయంలో రేవంత్ అక్కడే లేరు, అంతేగాక రాజకీయ కక్షతో అప్పటి ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని తెలిపారు.
అంతేగాక, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కూడా కీలక వాదనలు వినిపించారు. 2014లో చందానగర్‌లో ఇలాంటి మరో ఫిర్యాదు నమోదై ఆధారాల లేక కొట్టివేయబడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న కేసులో కూడా రేవంత్ సంఘటనా స్థలంలో లేరని 8 మంది సాక్షుల వాంగ్మూలాలు తేల్చిచెప్పాయన్నారు.
అంతిమంగా, ఈ కేసుపై హైకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది. త్వరలోనే తీర్పు వెలువడనుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
Read More : పోలవరం ముంపు గ్రామాలపై కేంద్రానికి కవిత డిమాండ్

One thought on “రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ ముగిసింది”
Comments are closed.