పోలవరం ముంపు గ్రామాలపై కేంద్రానికి కవిత డిమాండ్

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జూన్ 25న ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ‘ప్రగతి ఎజెండా’ సమావేశంలో ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.

శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే తాము వ్యతిరేకించామని, సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం రాలేదని గుర్తు చేశారు.

2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ద్వారా తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశారని, లోయర్‌ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం పార్లమెంటులో పోరాటం చేసినప్పటికీ కేంద్రం స్పందించలేదని విమర్శించారు.

పోలవరం జలాశయ సామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షలకు పెంచడమే ముంపు తీవ్రతకు కారణమవుతోందని కవిత తెలిపారు. మానవతా దృక్పథంతో కేంద్రం దీనిపై స్పందించాలని, ముంపునకు గురైన గ్రామాల అంశాన్ని తొందరగా పరిష్కరించాలని కోరారు.

ప్రస్తుతం ముంపులో ఉన్న పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను వెంటనే తెలంగాణకు తిరిగి అప్పగించాలన్నారు. “జూన్ 25న ప్రధాని మోదీ నిర్వహించే ముఖ్యమంత్రి సమావేశంలో ఈ ప్రకటన రావాలి” అని ఆమె స్పష్టం చేశారు.

Read More : హన్మకొండ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

One thought on “పోలవరం ముంపు గ్రామాలపై కేంద్రానికి కవిత డిమాండ్

Comments are closed.