పెళ్లికి కొన్ని గంటల ముందు వరుడి దారుణ హత్య…

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహ వేడుక విషాదంలోకి మారింది. పెళ్లి తాళి కట్టాల్సిన కొన్ని గంటల ముందు వరుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రాథమిక దర్యాప్తులో వరుడి కాబోయే భార్యకు ఉన్న గుట్టు ప్రేమ సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ధనుపుర గ్రామానికి చెందిన నిహాల్ (35) అనే యువకుడికి జూన్ 15వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా, ముందురోజు రాత్రి హత్యకు గురయ్యాడు. వంటవాడుగా పనిచేస్తున్న నిహాల్‌కు నాలుగు నెలల క్రితమే గుల్ఫాషా అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే, జూన్ 14 రాత్రి వధువు బంధువు అంటూ ఓ వ్యక్తి నిహాల్‌కు ఫోన్ చేయడంతో, అతడు బయటకు వెళ్లిన తరువాత తిరిగి రాలేదు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో గుల్ఫాషా పొరుగింటి వ్యక్తి సద్దాం (32)తో గత సంవత్సరం నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. పెళ్లి ఇష్టంలేని గుల్ఫాషా, తన ప్రియుడు సద్దాం, అతని స్నేహితులు ఫర్మాన్, అనీస్‌లతో కలిసి నిహాల్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేశారు.

జూన్ 16న ప్రధాన నిందితుడు సద్దాంను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిహాల్ ఫోన్‌ను తానే దాచినట్లు అతడు ఒప్పుకున్నాడు. కానీ, మొబైల్ స్వాధీనం చేసే సమయంలో పోలీసుల తుపాకీ లాక్కుని పారిపోవాలని ప్రయత్నించగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వధువు గుల్ఫాషా, ఫర్మాన్, అనీస్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మేఘాలయ హనీమూన్ హత్య ఉదంతం మరువకముందే, ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.

Read More : ప్రయాణికుల్ని భయపెట్టిన ఫుడ్ కోర్టు దృశ్యాలు

One thought on “పెళ్లికి కొన్ని గంటల ముందు వరుడి దారుణ హత్య…

Comments are closed.