అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరని… కేవలం దేశ శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సుంకాల పెంపు బెదిరింపులు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శనివారం జరిగిన ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్–2025లో రాజ్‌నాథ్ ప్రసంగించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఆపాలని, భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్… “ప్రపంచం వేగంగా మారుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా రక్షణాత్మక విధానాలు అవలంబిస్తున్నాయి. వాణిజ్య, సుంకాల యుద్ధం తీవ్రమవుతోంది” అని పేర్కొన్నారు.
“ఎంత ఒత్తిడి వచ్చినా భారత్ తన ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు, పౌరుల ప్రయోజనాల విషయంలో రాజీపడదు. వారి సంక్షేమమే మాకు ప్రథమ ప్రాధాన్యం. మాపై ఎంత ఒత్తిడి పెంచినా మా విధానాలు మారవు” అని ఆయన స్పష్టం చేశారు.
ఒత్తిళ్లు పెరిగేకొద్దీ భారత్ మరింత బలపడుతుందని, ఆత్మనిర్భరత దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ సిద్ధాంతాలు, నైతిక విలువల విషయంలో ఎప్పటికీ రాజీపడరని గుర్తుచేశారు. భారత్ ఎవరినీ శత్రువుగా చూడదని, కానీ దేశ ప్రయోజనాలకు అడ్డువచ్చే వారిని మాత్రం సహించబోమని రాజ్‌నాథ్ పరోక్ష హెచ్చరిక చేశారు.
Read More : లాస్ ఏంజెల్స్‌లో పోలీసుల కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి.(video)
