గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారాన్ని ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు. హిందూత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వ్యవహరించే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరబోనని తేల్చిచెప్పారు.
“కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల గౌరవం లేదు. అలాంటి పార్టీల్లోకి వెళ్లే ప్రశ్నే లేదు. నేను ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు వీరాభిమానిని. వారి సిద్ధాంతాలే నా దిశానిర్దేశం. చివరి వరకు హిందూత్వాన్ని కాపాడటానికే కట్టుబడి ఉంటా” అని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆయన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, శివసేన పార్టీలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. గతంలోనూ మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి శివసేన తరఫున రాజాసింగ్ పోటీ చేస్తారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుతం తెలంగాణలో శివసేన ప్రభావం తక్కువగా ఉన్నా, రాజాసింగ్ వంటి బలమైన నాయకుడు పార్టీలో చేరితే, రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపొస్తుందని శివసేన వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై స్పష్టత ఇచ్చిన రాజాసింగ్, తన తదుపరి రాజకీయ గమ్యం ఏంటనే ప్రశ్నకు ఇంకా సమాధానం ఇవ్వకపోవడంతో, ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన్ను శివసేన వైపు లాగేందుకు ఆ పార్టీ యత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
Read More : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

One thought on “రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్…”
Comments are closed.