కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వెంకట్రాయిపురం గ్రామానికి చెందిన నాగేంద్ర అనే యువకుడు తన వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పెద్ద చదువులు చదవకపోయినా, ఐటీఐ ఫిట్టర్ వరకు మాత్రమే విద్యాభ్యాసం చేసిన ఈ యువకుడు స్వయంగా ఒక మినీ యుద్ధ ట్యాంక్‌ను రూపొందించి ప్రజల్లో ప్రోత్సాహాన్ని రేపాడు. ప్రస్తుతం కాకినాడలో డ్రైవర్‌గా పని చేస్తున్న నాగేంద్రకు చిన్ననాటి నుంచే ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న కోరిక ఉందట. అదే ఉత్సాహంతో ఐదేళ్ల క్రితం చెక్కలతో చిన్న ట్యాంక్ తయారు చేసి, దాన్ని కాకినాడ ఎస్పీ కార్యాలయానికి అందించి అధికారుల ప్రశంసలు పొందాడు. ఇప్పుడు మరింత అభివృద్ధి చేసి, ఒక మంచి ప్రోత్సాహంతో రూ.1.80 లక్షల ఖర్చుతో మినీ యుద్ధ ట్యాంక్ తయారు చేశాడు. ఈ ట్యాంక్‌ను కాకినాడ లైట్ హౌస్ బీచ్ వద్ద ప్రదర్శనకు ఉంచగా, పలువురు ప్రజలు నాగేంద్ర ప్రతిభను ప్రశంసిస్తున్నారు.
ఈ ట్యాంక్ తయారీకి ట్రాక్టర్, ఆటో, మోటార్ సైకిళ్ల పరికరాలు, ఇనుప రేకులు, సీలింగ్ షీట్లు, విద్యుత్ పరికరాలు వాడినట్టు నాగేంద్ర తెలిపారు. సుమారు 45 రోజులు శ్రమించి ఈ ట్యాంక్‌ను తయారు చేశారన్నారు.
ఆర్మీపై ఉన్న అభిమానం వల్లే ట్యాంక్ రూపొందించానని నాగేంద్ర చెప్పారు. గతంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరైనా, రన్నింగ్‌లో వెనుకబడటంతో ఎంపిక కాలేకపోయానని తెలిపారు. అయినా ఆర్మీకి ఏదో రూపంలో ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈ ప్రయత్నం చేశానని చెప్పారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ట్యాంక్‌ను రూపొందించానని చెప్పిన నాగేంద్ర, ప్రతి ఐదు సెకన్లకూ ఒక తూటా పేలే విధంగా ట్యాంక్‌ను డిజైన్ చేశానని, ఇది 600 మీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని తెలిపారు. తనకిష్టమైన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఆయనను కలిసి తన ఆకాంక్షను తెలియజేయాలని ఉందని నాగేంద్ర చెప్పడం విశేషం. ప్రతిభ కలిగిన యువకుడికి పవన్ కల్యాణ్ నుంచి స్పందన వస్తుందని, అతని ఆశలు నెరవేరాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Read More : పవన్ కల్యాణ్ చేతుల మీదుగా వాసుకికి ఆర్థిక సహాయం

One thought on “కాకినాడ యువకుడి సృజనాత్మకతకు ప్రశంసల వెల్లువ”
Comments are closed.