తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రాజాసింగ్ విమర్శలు
హోలీ నిబంధనలపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం పాలనలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పని లేదు. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు? రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు కూడా పడుతుంది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీపై విమర్శలు
తెలంగాణ బీజేపీ నేతలపై కూడా రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. “తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలంటే బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ రావాలి” అని రాజాసింగ్ అన్నారు.
