లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితుడు, రాజ్ కసిరెడ్డి చివరికి పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేసిన పోలీసులు, రాత్రికి రాత్రే విజయవాడకు తరలించి, సీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణ కొనసాగిస్తున్నారు.

సోమవారం రాత్రి 11 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు నాలుగు గంటల పాటు సిట్ అధికారులు రాజ్‌ కసిరెడ్డిని ప్రశ్నించారు. మళ్లీ ఉదయం 7:30 గంటలకు విచారణను తిరిగి ప్రారంభించారు. ఇప్పటికే సేకరించిన ఆధారాలు, పలువురు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ఆయనను విచారిస్తున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో మద్యం కుంభకోణాన్ని నడిపించిన కసిరెడ్డిపై సిట్ అధికారులు గట్టి ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా విచారణకు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాకపోవడంతో, చివరకు నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్ట్ చేశారు.

ఇక మరోవైపు, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న కసిరెడ్డి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‌పై తన తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించినా, హైకోర్టు దీనిపై స్పష్టంగా వాయిదా విధించింది.

అలాగే, రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రులు సైతం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమారుడిని, కుటుంబ సభ్యులను ఇంటి వద్దే అడ్వకేట్ సమక్షంలో విచారించాలంటూ కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించి, బీఎన్‌ఎస్‌ఎస్ చట్ట నిబంధనల మేరకు ఇంటి వద్దే విచారించాలని సిట్ అధికారులను ఆదేశించింది. అలాగే తొందరపాటు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు జరిగిన విచారణలో కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మే 5న ఈ కేసులో తదుపరి విచారణ జరుగనుంది.

Read More : పోలవరం డయాఫ్రం వాల్ పనులు వేగవంతం — 2027లో పూర్తిచేసే లక్ష్యం