కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆయన బుధవారం ఝార్ఖండ్‌లోని చాయ్‌బాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయస్థానం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళ్తే… 2018లో చాయ్‌బాసాలో జరిగిన ఓ బహిరంగ సభలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం రాహుల్ గాంధీ వ్యక్తిగత హాజరును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
మూల షెడ్యూల్ ప్రకారం ఆయన జూన్ 26న హాజరుకావాల్సి ఉండగా, ఇతర కార్యక్రమాల కారణంగా రాహుల్ తరఫు న్యాయవాదులు ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆయన ఆగస్టు 6న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ ఈరోజు చాయ్‌బాసా కోర్టులో హాజరయ్యారు. ఇదే సమయంలో ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంత్యక్రియల అనంతరం రాంచీ నుంచి హెలికాప్టర్‌లో చాయ్‌బాసాకు చేరుకున్న రాహుల్ రాకతో టాటా కాలేజ్ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేసి, కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత కల్పించారు. బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది.
Read More : దిల్లీలో కర్తవ్యభవన్ ప్రారంభం

One thought on “రాహుల్ గాంధీకి చాయ్‌బాసా కోర్టు బెయిల్ మంజూరు”
Comments are closed.