భారత్‌లో సివిల్ డిఫెన్స్ మోక్ డ్రిల్‌కు కేంద్రం సిద్ధం

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోందనే ఊహాగానాలతో పాకిస్తాన్ హడలిపోతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా, పౌరులకు అవగాహన కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7వ తేదీ బుధవారం దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మోక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

మోక్ డ్రిల్‌లో ముఖ్య అంశాలు ఇవే:

ఈ డ్రిల్‌లో శత్రుదేశాల వైపు నుంచి యుద్ధ ముప్పు లేదా ఆకస్మిక దాడులు జరిగితే, పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించనున్నారు.

  • వైమానిక దాడులకు సంబంధించి హెచ్చరికల కోసం సైరన్లు మోగించనున్నారు
  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌తో హాట్‌లైన్ మరియు రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలను టెస్ట్ చేస్తారు
  • కంట్రోల్ రూములు, షాడో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించనున్నారు
  • విద్యార్థులు, పౌరులకు ఆత్మరక్షణ పాఠాలు అందిస్తారు
  • ఆకస్మికంగా విద్యుత్ సరఫరా నిలిపివేసే క్రాష్ బ్లాక్‌అవుట్ నిర్వహిస్తారు
  • దేశానికి కీలకమైన ప్లాంట్లు, సంస్థలపై శత్రువుల కన్ను పడకుండా కామోఫ్లేజింగ్ చర్యలు చేపడతారు
  • బంకర్లు, కందకాలు శుభ్రపరచడం, పౌర రక్షణ తరలింపు ప్రణాళికలను అమలుచేసి పరీక్షిస్తారు

ఈ డ్రిల్ ముఖ్య ఉద్దేశం దేశ పౌరుల్లో అప్రమత్తత పెంచడం, అత్యవసర సమయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్‌గా అర్థం చేయించడమేనని అధికారులు వెల్లడించారు.

ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దేశ భద్రతను మరింత బలోపేతం చేయడంలో సహాయపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : జమ్మూ కశ్మీర్ భద్రతపై పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం