పంజాబ్‌లో మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కాంచన్ దేవి హత్య..

పంజాబ్‌లోని బఠిండాలో భయానక ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్‌ పోస్ట్ చేస్తున్నారన్న కారణంతో ఓ మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. బాధితురాలు కమల్ కౌర్ బాబీగా ఫేమస్ అయిన 25 ఏళ్ల కాంచన్ దేవి. ఆమెను గొంతు నులిమి హత్య చేసి, కారులోనే మృతదేహాన్ని వదిలేసి నిందితులు పరారయ్యారు. ఈ ఘటనను మోరల్ పోలీసింగ్ చర్యగా పోలీసులు భావిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ బోల్డ్ వీడియోలు పోస్ట్ చేస్తున్న కాంచన్‌పై అమృతపాల్ సింగ్ మెహ్రో అనే నిహాంగ్ వర్గానికి చెందిన వ్యక్తి ముందుగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై, వీడియో ప్రమోషన్ చేస్తున్నట్లు చెప్పి ఆమెను తన కుట్రలోకి లాగాడు. జూన్ 9న తన అనుచరులు జస్‌ప్రీత్ సింగ్, నిమ్రత్‌జిత్ సింగ్‌లను పంపించి, ఆమెను బఠిండాకు రప్పించాడు.

బఠిండా చేరుకున్న తర్వాత కారులోపల ఉన్న కాంచన్‌ను, జస్‌ప్రీత్ ఓ గుడ్డతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వెనుక సీటులో ఉంచి, కారును మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి, జస్‌ప్రీత్ సింగ్, నిమ్రత్‌జిత్ సింగ్‌లను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అమృతపాల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. అమృతపాల్, నిమ్రత్‌జిత్‌పై 2021లో కూడా బర్నాలాలో నైతిక పోలీసింగ్ కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణం సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read More : హనీమూన్ హత్య కేసులో మరో షాకింగ్ నిజం

One thought on “పంజాబ్‌లో మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కాంచన్ దేవి హత్య..

Comments are closed.