దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో నిందితురాలు సోనమ్, ఆమెతో కలిసి పనిచేసిన హంతకులు భర్త రాజా రఘువంశీని హత్య చేయడానికి మూడుసార్లు విఫలయత్నాలు చేసినట్టు స్పష్టమైంది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ వివేక్ సియామ్ మీడియాకు వెల్లడించారు. చివరికి నాలుగో ప్రయత్నంలో రాజాను దారుణంగా హత్య చేసినట్టు ఆయన తెలిపారు.
పోలీసుల విచారణలోని వివరాల ప్రకారం, మొదట గువాహటిలోనే హత్య చేసి మృతదేహాన్ని ఎక్కడో పారవేయాలని హంతకులు ప్రణాళిక వేసినప్పటికీ, అనుకోని కారణాలతో ఆ యత్నం విఫలమైంది. ఆ తర్వాత మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో రెండుసార్లు హత్యకు ప్రయత్నించారు. మొదట నంగ్రిట్ వద్ద హత్య చేయాలని చూస్తే స్థలం అనుకూలించకపోయింది. అనంతరం మవ్లాఖియట్, వెయిసావ్‌డోంగ్ వద్ద కూడా ప్రణాళికలు రూపొందించారు. వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో రాజాను హత్య చేయాలనుకున్నా, అది కూడా వీలు కాకపోయింది. చివరికి వెయిసావ్‌డోంగ్ జలపాతానికి వెళ్లినప్పుడు రాజాపై దాడి చేసి హత్య చేసినట్టు ఎస్పీ వివరించారు.
సోనమ్, రాజా రఘువంశీల వివాహం మే 11న జరిగింది. తర్వాత ఈ జంట గువాహటిలోని కామాఖ్య దేవాలయాన్ని సందర్శించారు. హంతకులు మే 19న గువాహటికి చేరుకొని ముందుగా అక్కడే ప్రణాళికలు రూపొందించుకున్నారు. కానీ సోనమ్ షిల్లాంగ్, సోహ్రాకు వెళ్లాలని నిర్ణయించడంతో వారు కూడా అక్కడికి వెళ్లి తనను అనుసరించారు.
రాజా కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తోంది. మే 20న నవ దంపతులు హనీమూన్‌కు మేఘాలయకు వెళ్లారు. అనంతరం వారు అదృశ్యమయ్యారు. 11 రోజుల తర్వాత సోహ్రాలోని జలపాతానికి సమీపంలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు ఇది హత్యేనని నిర్ధారించారు.
ఇలా రోజుకో కొత్త షాకింగ్ వాస్తవం వెలుగులోకి వస్తుండడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Read More : మెడికల్ కాలేజ్ విద్యార్థి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కథ.

2 thoughts on “హనీమూన్ హత్య కేసులో మరో షాకింగ్ నిజం”
Comments are closed.