మిథున్ రెడ్డి అరెస్ట్‌కు ప్రయత్నించిన S.I.T.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం (లిక్కర్ స్కామ్) కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ S.I.T. అధికారులు విజయవాడ ACB కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా, ఇటీవల సుప్రీంకోర్టు కూడా అదే దిశగా నిర్ణయం తీసుకుంది. దీంతో మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన S.I.T., ఆయనను అరెస్ట్ చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే, అరెస్ట్ వారెంట్ కోసం దాఖలు చేసిన S.I.T. పిటిషన్‌ను ACB కోర్టు తిరస్కరించింది. దరఖాస్తుతో పాటు సుప్రీంకోర్టు మెమో మరియు ఇతర కీలక పత్రాలు సమర్పించలేదని పేర్కొంటూ, వాటిని జతచేసి మళ్లీ దాఖలు చేయాలని కోర్టు సూచించింది.

ఇక మిథున్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడానికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్టు సమాచారం. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ నేపథ్యంలో ఈ కేసు మరింత వేడెక్కనుందని భావిస్తున్నారు.

Read More : స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం