జమ్మూ కశ్మీర్లో అభివృద్ధి ప్రస్థానానికి చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శుక్రవారం కశ్మీర్ లోయలో పర్యటించిన ప్రధాని, ఈ ప్రతిష్ఠాత్మక వంతెనను జాతికి అంకితం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి లోయలోకి వచ్చిన ఆయన, ఈ వేదిక నుంచి ఉగ్రవాదంపై భారత్ యుద్ధం నిలకడగా కొనసాగుతుందన్న సంకేతాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, ‘‘కశ్మీర్ అభివృద్ధికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, కుట్రలు పన్నినా ఎవరూ ఆపలేరు. చినాబ్ వంతెన నిర్మాణం మా సంకల్పబలానికి నిదర్శనం’’ అని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆదిల్ హుస్సేన్ అనే పోనీవాలాను ఆయన స్మరించుకుంటూ, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ కుట్రలు ఏమీ సాధించవు
‘‘మన పొరుగున ఉన్న దేశం పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని చూస్తోంది. పేదల జీవనోపాధిపై దాడి చేస్తోంది. కానీ, ఉగ్రవాదంపై మన పోరాటం ఆగదు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మేం తమదైన శైలిలో సమాధానం ఇచ్చాం. నెల క్రితం ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన భద్రతా బలగాల ధైర్యానికి ఇది తార్కాణం’’ అని మోదీ అన్నారు.
చినాబ్ వంతెన – భారత ఇంజినీరింగ్ కు ప్రతీక
ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉండే ఈ వంతెన భారత ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు. ‘‘ఈ వంతెన నిర్మాణంతో కశ్మీర్ పూర్తిగా భారత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ప్రయాణం ఇప్పుడు వాస్తవంగా మారింది. ఈ రోజు కోసం ఎన్నో తరాలు ఎదురు చూశాయి’’ అని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, ‘‘సీఎం ఒమర్ అబ్దుల్లా 8వ తరగతి నుంచే ఈ ప్రాజెక్ట్ కలలు కనేవారు. ఇప్పుడు ఆ కలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది’’ అని మోదీ చెప్పారు. చినాబ్ వంతెన ప్రారంభంతో కశ్మీర్ అభివృద్ధిలో కొత్త శకం ప్రారంభమవుతోందని ఆయన స్పష్టం చేశారు.
Read More : ఆర్సీబీ విజయోత్సవాల్లో 11 మంది మృతిపై కేఏ పాల్ తీవ్ర ఆవేదన.

One thought on “చినాబ్ వంతెన ప్రారంభంతో జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోదీ”
Comments are closed.