సోనియా గాంధీ సమక్షంలో నామినేషన్ దాఖలు చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి

దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరు వేడెక్కింది. ఈసారి తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవేత్త, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి విపక్ష ఇండియా కూటమి తరఫున బరిలో దిగారు. ఈరోజు ఆయన అధికారికంగా తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన 20 మంది ఎంపీలు ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామం. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన, న్యాయరంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. 2005 నుంచి 2007 వరకు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించి పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత గోవా రాష్ట్రానికి లోకాయుక్తగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఇటీవల రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఇక అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను పోటీలో నిలిపిన విషయం తెలిసిందే.

Read More : మధురైలో విజయ్ భారీ బహిరంగ సభ