ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం.

పంజాబ్‌లోని ఆదంపుర్‌ వైమానిక స్థావరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందడి చేశారు. అక్కడ సైనికులతో సమావేశమైన మోదీ, దేశ భద్రతపై మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత సైన్యం పూర్తి కృతనిశ్చయంతో ఉందని గట్టిగా ప్రకటించారు. “ఈ యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

తన ప్రసంగాన్ని “భారత్ మాతాకీ జై” నినాదంతో ప్రారంభించిన మోదీ, ఈ నినాదం శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించిందని చెప్పారు. ఉగ్రవాదుల గూళ్లను ఛిద్రం చేసిన మన డ్రోన్లు, క్షిపణులు శత్రువులను భయపెట్టాయని పేర్కొన్నారు. “మన సైనికుల ధైర్యానికి, నిబద్ధతకు దేశం గర్వపడుతోంది. యుద్ధ భూమిలో ప్రతిధ్వనించిన ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు ఆకాశాన్ని దాటి వినిపించాయి” అని మోదీ గర్వంగా తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రస్తావించిన ప్రధాని, “మీరు సాధించిన విజయంతో దేశ ప్రజలు మీకు సెల్యూట్ చేస్తున్నారు. ప్రతి భారతీయుడి గుండె నిండా మీ పట్ల కృతజ్ఞత ఉంది” అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో చూపిన పరాక్రమం ప్రపంచాన్ని ఆకట్టుకుందన్నారు.

భారత శక్తిని అణ్వస్త్రాల బెదిరింపులతో తగ్గించేందుకు ప్రయత్నించినవారికి మన సైన్యం సముచిత బుద్ధి చెప్పిందని, మన సైన్యం వీరత్వం తనను ఎంతో ప్రేరేపించిందని చెప్పారు. “భారత శక్తిని చూసి నా జీవితమే ధన్యమైందని భావిస్తున్నా” అని మోదీ ఉద్వేగంగా వెల్లడించారు.

మహిళల గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. “మన అక్కాచెల్లెళ్ల నుదిటి సిందూరాన్ని తుడిచిన వారిని, వారి ఇంట్లోనే చేరి ధ్వంసం చేశాం. ఇది భారత సైనికుల ధైర్యానికి నిదర్శనం” అని గర్వంగా పేర్కొన్నారు.

Read More : పాక్‌పై మళ్లీ సంచలన వ్యాఖ్యలు