ఉత్తరాఖండ్‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్ళిన ఒక ప్రైవేటు హెలికాప్టర్ ఉత్తరకాశీ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా మొత్తం ఏడుగురు ఉన్నట్లు సమాచారం.
గంగోత్రి యాత్రికులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి హర్సిల్ హెలిప్యాడ్ కు బయలుదేరి, అక్కడి నుంచి పర్యాటకులు రోడ్డు మార్గంలో గంగ్నానీకి వెళ్లాల్సి ఉండేది. మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) మరియు జిల్లా యంత్రాంగ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదం గురించి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. “ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని భరించేందుకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను,” అని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన ఆదేశించారు.
Read More : Pak ఫేక్ న్యూస్ – భారత ప్రభుత్వ స్పందన
