దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇటీవల కొత్త కేసులు నమోదు అవుతుండగా, దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,000 దాటినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ స్పందించారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య నియమాలను పాటించడం ఇప్పుడు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
కాన్సర్ పేషెంట్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ బహల్ సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,009 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత వారం రోజుల వ్యవధిలో కొత్తగా 750 మందికి వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత రాష్ట్రాలు గమనిస్తున్నాయని, ఎలాంటి పరిస్థితికైనా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచడం వంటి పాత ఆరోగ్య ఆచారాలను పాటించడం మళ్లీ అవసరమవుతోంది.
Read More : వరలీ మెట్రో స్టేషన్ జలమయం… జనజీవనం స్తంభనం.

2 thoughts on “దేశంలో మళ్లీ కరోనా ముప్పు…”
Comments are closed.