అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ఈ దినోత్సవం మహిళల బలాన్ని, శక్తిని చాటే ప్రత్యేకమైన రోజు అని వ్యాఖ్యానించారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
బడ్జెట్‌లో మహిళలకు పెద్దపీట – సీఎం చంద్రబాబు
మహిళల సాధికారత కోసం ఇప్పటికే అనేక సంస్కరణలు అమలు చేసినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. 2025-26 వార్షిక బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అదేవిధంగా, ‘దీపం 2’ పథకం ద్వారా 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించినట్లు వివరించారు. పేద మహిళల జీవితాల్లో మార్పు తేవడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్‌వాడీ సెంటర్ల బలోపేతం వంటి పథకాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
మహిళాభివృద్ధి ద్వారా సమాజ అభివృద్ధి – చంద్రబాబు
మహిళల సాధికారతే సమాజ పురోగతికి మార్గదర్శకం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక స్వావలంబన, రాజకీయాల్లో రిజర్వేషన్లతో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని గుర్తు చేశారు. మహిళల గౌరవం, భద్రత, సాధికారత కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
- 10:45 AM: హెలీప్యాడ్ చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.
- 10:55 AM – 11:15 AM: జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష.
- 12:20 PM: స్టాల్స్ సందర్శన, రుణాల పంపిణీ, పథకాల ప్రారంభోత్సవం.
- 1:00 PM – 2:30 PM: మహిళలతో ముఖాముఖి కార్యక్రమం.
- 2:35 PM – 4:05 PM: టీడీపీ కార్యకర్తలతో సమావేశం.
- 4:05 PM – 4:30 PM: జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణం.
మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి – నారా లోకేష్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సాధికారతే సమాజ పురోగతికి కీలకమని అభిప్రాయపడిన ఆయన, సమాన అవకాశాలు కల్పించినపుడే మహిళలు అత్యుత్తమంగా రాణిస్తారని అన్నారు.
తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతికి అండగా నిలుస్తోందని నారా లోకేష్ స్పష్టం చేశారు. మహిళల భద్రత, సాధికారత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆర్థిక మరియు సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, మహిళలు తమ రంగాల్లో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

One thought on “మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు”
Comments are closed.