ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మళ్లీ అభివృద్ధి పనులకు నాంది పలికేందుకు కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో మే 2వ తేదీని ముఖ్య ముహూర్తంగా నిర్ణయించి, ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పునఃప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అధికార కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపింది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి ప్రభుత్వ ప్రోటోకాల్ అధికారులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే అప్పటికి జగన్ ఇంట్లో లేనందున, ఆయన వ్యక్తిగత సహాయకుడు కే. నాగేశ్వరరెడ్డికి ఆ పత్రికను అప్పగించారు.
గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ ప్రభుత్వం జగన్‌ను ఆహ్వానించినా, ఆయన హాజరు కాలేదు. ఈసారి ప్రధాని మోదీ హాజరవుతున్న ఇంత పెద్ద స్థాయిలో జరిగే కార్యక్రమానికి జగన్ వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వేగంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది.
ఈ క్రమంలోనే మే 2న ప్రధాని మోదీ అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లను మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటులు ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది.
Read More : పవన్ కళ్యాణ్ పేరు … చివరికి చేర్చిన ప్రభుత్వం

2 thoughts on “జగన్‌కు కూటమి ప్రభుత్వం ఆహ్వానం”
Comments are closed.