దేశ రక్షణ రంగంలో మరో భారీ అడుగు వేసింది భారత్. పూర్తి స్థాయిలో స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న డైవింగ్ సపోర్ట్ నౌక ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ భారత నౌకాదళంలో చేరింది. శుక్రవారం జరిగిన అధికారిక కార్యక్రమంలో కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేథ్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కలిసి INS నిస్తార్‌ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక విశాఖపట్నం కేంద్రంగా భారత నౌకాదళానికి సేవలందించనుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ప్రతీకగా నిర్మితమైన ఈ నౌక 15 సార్లు సముద్ర పరీక్షల (Sea Trials)ను విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ నౌక నిర్మాణానికి 120కి పైగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (MSMEs) కంపెనీలు భాగస్వాములయ్యాయి. 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ నౌక సముద్ర గర్భంలో సబ్ మెరైన్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం కీలకంగా పనిచేస్తుంది. అత్యవసర సమయంలో సబ్ మెరైన్‌లలో చిక్కుకున్న నౌకాదళ సిబ్బందిని రక్షించడంలో ఇది ప్రధాన పాత్ర పోషించనుంది.
నౌకలో ఏర్పాటు చేసిన ఎయిర్ మరియు మిక్స్‌డ్ డైవింగ్ కాంప్లెక్స్ 75 మీటర్ల లోతులో డైవింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే సముద్ర తళంలో నుంచి 15 టన్నుల బరువును ఎత్తగలిగే మెరైన్ క్రేన్ కూడా ఇందులో ఉంది. ఇలాంటి ఆధునిక వసతులతో రూపొందించిన INS నిస్తార్, భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందనే విశ్వాసాన్ని రక్షణ శాఖ వ్యక్తం చేస్తోంది. సముద్ర రక్షణలో కీలక బలం అవుతుందని నౌకాదళ అధికులు తెలిపారు.
Read More : జగన్ పై పయ్యావుల కీలక వ్యాఖ్యలు
