మంత్రి సీతక్క – అభివృద్ధి పనులపై తాజా సూచనలు

తెలంగాణ మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ డాక్టర్ జి. అపర్ణ, ములుగు, మహబూబాబాద్ డీఎఫ్ఓలు, ఐటీడీఏ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అటవీ, అభయారణ్య చట్టాల పరిధిలో రోడ్లు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలనీ మంత్రి ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడులు, బడులు, ఆస్పత్రులు, కనీస మౌలిక సదుపాయాలు అందించే పనులు ఆర్వోఎఫ్‌ఆర్ చట్టం వల్ల ఆపబడవద్దని స్పష్టం చేశారు. అటవీ శాఖతో సమన్వయం చేయడం ద్వారా అభివృద్ధి పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలని సూచించారు.

దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారుల సౌకర్యం లేకపోవడం వలన అంబులెన్స్ సైతం వెళ్ళలేకపోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అందుకే నియమాల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగరాదు అని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం సమస్యగా ఉందని గుర్తుచేశారు.

మంత్రి సీతక్క ఆదేశాలతో అటవీ శాఖ, రోడ్డు, భవనాలు, పంచాయతీ ఇంజనీరింగ్ విభాగాలు, ఐటీడీఏ అధికారులు కనీస రహదారి సదుపాయాలను త్వరగా కల్పించాలని హామీ ఇచ్చారు. అటవీ, అభయారణ్య చట్టాల కింద రోడ్లు, కల్వర్టులు నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం అంగీకరించకపోతే గ్రావెల్, మట్టి రోడ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. ములుగు నియోజకవర్గ ఏజెన్సీలో పెండింగ్ పనుల జాబితాను అటవీ శాఖకు అందించి, ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ విభాగంతో చర్చించి పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

Read More : కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో మంత్రి శ్రీధర్ బాబు ఊరట

One thought on “మంత్రి సీతక్క – అభివృద్ధి పనులపై తాజా సూచనలు

Comments are closed.