మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన అందరినీ కలచివేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ తీవ్ర ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో, గాయాలపాలైన ఓ మహిళ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన స్థానిక వైద్య సదుపాయాల లోపాన్ని, జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తీవ్రతను బహిర్గతం చేసింది. వివరాల్లోకి వెళ్తే… పాల్ఘర్ జిల్లా మధుకర్ నగర్‌కు చెందిన ఛాయా పురవ్ (49) జూలై 31న ఇంటి సమీపంలో ఒక చెట్టు కొమ్మ విరిగి పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. తల, పక్కటెముకలు, భుజాలకు తీవ్రమైన గాయాలు కావడంతో, స్థానిక వైద్యులు అత్యవసర చికిత్స కోసం ముంబై హిందూజా ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
సాధారణంగా ఆ ప్రయాణానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంబులెన్స్‌లో ఆమె భర్త కౌశిక్‌తో కలిసి ముంబై బయలుదేరారు. అయితే జాతీయ రహదారి-48పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో మూడు గంటలు గడిచినా సగం దూరం కూడా చేరుకోలేకపోయారు. సాయంత్రం 6 గంటలకు అనస్థీషియా ప్రభావం తగ్గడంతో ఛాయా పురవ్ నొప్పితో విలవిల్లాడారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్ సిబ్బంది గమ్యానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరా రోడ్ ఆర్బిట్ ఆసుపత్రికి రాత్రి 7 గంటల ప్రాంతంలో తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించారు. “మరో అరగంట ముందే వచ్చి ఉంటే ప్రాణం కాపాడగలిగేవాళ్లం” అని వైద్యులు పేర్కొనగా, భర్త కౌశిక్ కన్నీరు మున్నీరయ్యారు.
“నాలుగు గంటల పాటు ఆమె నొప్పితో అరిచింది, వేడుకుంది. కానీ మేము ఏమీ చేయలేకపోయాం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై గుంతలు, రాంగ్ రూట్‌లో వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ మరింత పెరిగిందని వాపోయారు. ఈ ఘటన పాల్ఘర్‌లో అత్యవసర వైద్య సదుపాయాల అవసరాన్ని మరోసారి స్పష్టంచేసింది.
Read More : బెంగళూరులో కొత్త క్రికెట్ స్టేడియం
