పాకిస్థాన్ సంచలన నిర్ణయం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శాంతి చర్చలకు పునాది అయిన చారిత్రక సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు గురువారం ఇస్లామాబాద్ అధికారికంగా ప్రకటించింది.

1971 భారత-పాకిస్థాన్ యుద్ధానంతరం, రెండు దేశాల మధ్య శాంతిని స్థాపించేందుకు 1972 జులై 2న హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోలు ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం, అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, మూడో పక్ష జోక్యం అంగీకరించబోమని ఇరు దేశాలు అంగీకించాయి. అలాగే, 1971 కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖ (LOC)గా గుర్తించి, దానిని ఏకపక్షంగా మార్చకూడదన్న నిబంధనను కూడా ఒప్పుకున్నారు.

ఇప్పటివరకు భారత్ నుంచి ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, నిపుణుల అంచనాల ప్రకారం, ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో తక్షణ ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో భారత్-పాక్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

ఈ పరిణామం దౌత్యపరంగా, భద్రతాపరంగా దక్షిణాసియాలో మార్పులకు నాంది కావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read More : పాక్ హైకమిషన్ వద్ద కేక్ బాక్స్ కలకలం