దలైలామా వారసత్వంపై భారత్ స్పష్టత

టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వారసత్వం విషయంలో చైనా చేస్తున్న వాదనలను భారత్ తిప్పికొట్టింది. 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు పూర్తిగా ప్రస్తుత దలైలామా, ఆయన ఆధ్వర్యంలోని గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకే ఉందని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ విషయమై మిగతావారు జోక్యం చేసుకునే అవకాశం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో గురువారం ప్రారంభమైన దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు భారత్ తరఫున హాజరయ్యే కిరణ్ రిజిజు, చైనా ప్రకటనను ఖండిస్తూ మాట్లాడుతూ — “దలైలామా వారసుడిని ఎంపిక చేయాలంటే చైనా అనుమతి అవసరమన్న వాదన అస్వీకారయోగ్యం. ఇది పూర్తిగా టిబెట్ల మతసంస్థకు చెందిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ అనుచరుల విశ్వాసానికి ఇది సంబంధించిన విషయం” అని స్పష్టం చేశారు. ఇక, బుధవారం దలైలామా చేసిన ప్రకటనలో — తన వారసుడి ఎంపికకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకే ఉందని తెలిపారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే చైనా స్పందిస్తూ — తమ ఆమోదం లేకుండా దలైలామా ఎంపిక చెల్లదని, తమ విధానాలకు అనుగుణంగా జరిగితే తప్ప ఆ ఎంపికను అంగీకరించబోమని ప్రకటించింది.

1950లో టిబెట్ ఆక్రమణ తర్వాత నుంచి ఆ ప్రాంతాన్ని సంపూర్ణంగా నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న చైనా, తనకు అనుకూలంగా ఉండే వారిని దలైలామా స్థానంలో కూర్చోబెట్టే యత్నాల్లో ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, దలైలామా స్పష్టతనిచ్చిన వెంటనే భారత్ బాసటగా నిలిచి చైనా వైఖరిపై గట్టిగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More : లివర్‌పూల్ స్టార్ డియోగో జోటా ట్రాజిక్ మరణం

One thought on “దలైలామా వారసత్వంపై భారత్ స్పష్టత

Comments are closed.