అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వేడెక్కిన వేళ…

అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో, చైనా ప్రభుత్వం ఒక్కింత వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నుండి దిగుమతి అయ్యే కొన్ని కీలక ఉత్పత్తులపై 125 శాతం వరకు విధించిన ప్రతీకార సుంకాలను మినహాయించాలన్న యోచనలో బీజింగ్ ఉన్నట్లు సమాచారం.

చైనా పరిశ్రమలు ప్రధానంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈథేన్ వంటి పారిశ్రామిక రసాయనాలు, వైద్య పరికరాలు, విమానాల లీజులకు సంబంధించిన చెల్లింపులపై మినహాయింపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న అధిక సుంకాల కారణంగా విమానయాన సంస్థలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై అదనపు భారం తొలగించేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇటీవల అమెరికా 145 శాతం మేర సుంకాలను విధించగా, ప్రతిగా చైనా 125 శాతం వరకు సుంకాలు విధించింది. అయితే ఈ పరిణామాలు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో చైనా తాత్కాలిక వెనక్కి తగ్గే యత్నం చేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుగుతున్నాయని ప్రకటించినప్పటికీ, చైనా విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను ఖండించింది. ప్రస్తుతం ఎలాంటి అధికారిక చర్చలు జరుగుతున్నాయని స్పష్టత లేదు కానీ… సుంకాల మినహాయింపు దిశగా చైనా ముందడుగు వేయడం ఆసక్తికర పరిణామంగా మారింది.

Read More : పాకిస్థాన్ సంచలన నిర్ణయం