జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో పిటిషన్లు దాఖలు చేసే ముందు బాధ్యతతో ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించింది.
భద్రతా బలగాల ఉత్సాహాన్ని దెబ్బతీయవద్దు
ఈ పిల్‌పై విచారణ చేస్తూ ధర్మాసనం పిటిషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. “దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలి. పిటిషన్లు దాఖలు చేసే ముందు, వాటి పరిణామాలను మీరు అర్థం చేసుకోవాలి. మీ చర్యల ద్వారా భద్రతా దళాల నైతికతను దెబ్బతీయకండి. ప్రతి పౌరుడికి దేశం పట్ల బాధ్యత ఉంది” అని కోర్టు సలహా ఇచ్చింది.
దర్యాప్తు వ్యవస్థలపై నమ్మకం ఉండాలి
“ఉగ్రదాడుల వంటి కేసులు న్యాయ సమీక్షకు అంతగా అనర్హం. దర్యాప్తు సంస్థలు తమ విధులు నిర్వర్తిస్తుంటాయి. న్యాయమూర్తులు ఈ అంశాల్లో నిపుణులు కారు,” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
విద్యార్థుల భద్రతకై హైకోర్టును ఆశ్రయించవచ్చు
తాను ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే ఈ వ్యాజ్యం దాఖలు చేశానని పిటిషనర్ తెలిపిన తర్వాత, ధర్మాసనం స్పందించింది. “విద్యార్థుల భద్రతకు సంబంధించి చర్యలు కావాలనుకుంటే, సంబంధిత హైకోర్టులను ఆశ్రయించవచ్చు” అని సూచించింది. చివరికి పిటిషనర్ తన వ్యాజ్యాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు.
Read More : మే 1.. కార్మికుల దినోత్సవం: కార్మికుల శ్రమను గుర్తిద్దాం

2 thoughts on “జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు”
Comments are closed.