జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో జరిగిన భయానక ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ఈ దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2000 నుంచి ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత తీవ్రమైన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు, వారి అక్రమ కార్యకలాపాలను బయటపెట్టేందుకు అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
గుర్తించిన ఐదుగురిలో ముగ్గురు పాకిస్థాన్ జాతీయులు, ఇద్దరు స్థానిక జమ్మూకశ్మీర్ ప్రజలు ఉన్నారని తెలిపింది. పాకిస్థానీ ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ (కోడ్ నేమ్ మూసా), సులేమాన్ షా (కోడ్ నేమ్ యూనస్), అబు తల్హా (కోడ్ నేమ్ ఆసిఫ్)గా గుర్తించారు. స్థానికులుగా ఉన్న ఆదిల్ గురి, అహ్సాన్‌లను 2018లో పాకిస్థాన్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందినట్లు అధికారులు చెప్పారు.
ఈ దాడిలో ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారు అక్కడి పౌరులను ఇస్లామిక్ ప్రార్థనలు చెప్పమని, సున్నీ గుర్తులు చూపించాలని బలవంతం చేసినట్లు కేంద్ర ఏజెన్సీలు తెలిపాయి.
ఇప్పటికే జమ్మూకశ్మీర్ పోలీసులు ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను విడుదల చేశారు. వారి ఆచూకీ తెలియజేసిన వారికి రూ. 20 లక్షల రివార్డు ప్రకటించారు. మూసా, షా వంటి పాకిస్థానీ ఉగ్రవాదులు గతంలో పూంచ్‌లో జరిగిన దాడులతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. ఎన్ఐఏ బృందం దర్యాప్తును పర్యవేక్షిస్తున్నది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపైనా విచారణ కొనసాగుతోంది, ముఖ్యంగా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ అనుచరుడు సైఫుల్లా కసూరి పాత్రపై దర్యాప్తు సాగుతోంది.
భద్రతా బలగాలు ప్రస్తుతం ఉగ్రవాదులను పట్టుకునేందుకు విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Read More : పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ కఠిన నిర్ణయాలు

One thought on “పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పురోగతి”
Comments are closed.