అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల అస్త్రాన్ని ప్రయోగించారు. ఇప్పటికే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించిన ఆయన, తాజాగా రాగి దిగుమతులపై 50 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, ఏడాది తర్వాత ఔషధ (ఫార్మా) ఉత్పత్తులపై 200 శాతం వరకు సుంకాలు విధించనున్నట్లు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ తాజా ప్రకటన భారత్‌తో పాటు ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం జరిగిన అమెరికా క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ నిర్ణయాలు వెల్లడించారు. “ఈరోజు నుంచి రాగిపై చర్యలు తీసుకుంటున్నాం. దాని దిగుమతులపై 50 శాతం సుంకం విధించబోతున్నాం” అని తెలిపారు. ఈ సుంకాలు జూలై చివరి లేదా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ స్పష్టంచేశారు. ఇక ఫార్మా రంగంపై వచ్చే ఏడాది లేదా పన్నెండున్నర నెలల తర్వాత అమలయ్యే విధంగా కొత్త సుంకాలను తీసుకురాబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. “దిగుమతులపై 200 శాతం ట్యారిఫ్ వసూలు చేస్తాం. కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలి” అని హెచ్చరించారు.
ట్రంప్ తాజా వ్యాఖ్యలతో భారత ఎగుమతిదారులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే అమెరికా భారత ఔషధాలకి అతిపెద్ద మార్కెట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇవి మొత్తం ఎగుమతుల్లో 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అదే విధంగా రాగి ఎగుమతుల్లో భారత్ వాటా 17 శాతంగా ఉంది. 200 శాతం సుంకాలు అమలైతే దేశ పరిశ్రమలపై భారీ భారం పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read More : పాకిస్థాన్‌లో వర్షాల తాకిడి: 72 మంది మృతి

One thought on “ట్రంప్ సుంకాల హెచ్చరిక: ఔషధాలపై భారీ ట్యారిఫ్‌లు”
Comments are closed.