భారత రక్షణ దళాలు చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” విజయవంతంగా పూర్తైనట్టు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్‌కు తెలియజేశారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను కేబినెట్ సమావేశంలో ప్రధాని వెల్లడించారు. సరిహద్దు అవతల ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు కచ్చితమైన లక్ష్య దాడులు నిర్వహించాయని తెలిపారు. ఈ దాడులు ముందస్తుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారమే ఎటువంటి లోపం లేకుండా జరిగాయని మోదీ పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరులను బలిగొన్న ఉగ్రదాడికి ఇది సమాధానంగా చేపట్టిన చర్యగా వివరించారు. భారత త్రివిధ దళాలు — ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ — పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశాయని ప్రశంసించారు. వారి నైపుణ్యం, నిబద్ధత దేశ భద్రతకు పెద్ద బలమని ప్రధాని అభినందించారు. కేబినెట్‌లోని అన్ని మంత్రులు ప్రధాని నేతృత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ ఆపరేషన్‌కు “సిందూర్” అనే నామాన్ని ఇవ్వడం వెనక గాఢమైన భావోద్వేగం ఉందని తెలిసింది. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా ఈ పేరు పెట్టినట్లు సమాచారం.
దాడుల వివరాలు వెల్లడించేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో పాటు, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు పాల్గొన్నారు. తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య విశ్వసనీయ నిఘా సమాచార ఆధారంగా దాడులు జరిగాయని వారు చెప్పారు. ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలు, లాంచ్‌ప్యాడ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయని స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్ దేశ భద్రతపై భారత్ యొక్క దృఢ సంకల్పానికి నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
Read More : Amit shah : పాకిస్థాన్ రేంజర్ల కాల్పుల్లో 10 మంది భారతీయ పౌరులు మరణం

One thought on ““ఆపరేషన్ సిందూర్” విజయవంతం : PM”
Comments are closed.