మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ అధికారి కృపానందకు కూడా హైకోర్టు నోటీసులు పంపింది.
ఈ కేసులో గతంలో నాంపల్లి సీబీఐ కోర్టు వీరిద్దరిని నిర్దోషులుగా తేల్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని ఆధారంగా ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సబితా, కృపానందకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు ఈ ఏడాది మేలో తుది తీర్పు వెలువరించింది. 15 ఏళ్లపాటు సాగిన ఈ కేసులో ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రధాన నిందితులు గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారించింది. వీరికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది.
ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందకు సీబీఐ కోర్టు ఉపశమనం ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.
Read More : రాహుల్ సిప్లిగంజ్–హరిణి రెడ్డి నిశ్చితార్థం..

2 thoughts on “ఓబుళాపురం కేసులో సబితాకు హైకోర్టు నోటీసులు”
Comments are closed.