ఉత్తర కొరియా రహస్య క్షిపణి స్థావరం వెలుగులోకి

ఉత్తర కొరియా మరో రహస్య క్షిపణి స్థావరాన్ని నిర్మించిన విషయం ఆలస్యంగా బయటపడింది. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన ఈ స్థావరం నుంచి అమెరికాను సైతం లక్ష్యంగా చేసుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉండొచ్చని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ పరిణామం అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

సీఎస్‌ఐఎస్ నివేదిక ప్రకారం, నార్త్ ప్యోంగ్యాన్ ప్రావిన్స్‌లోని ‘సిన్‌పుంగ్-డాంగ్’ అనే ఈ స్థావరం చైనా సరిహద్దు నుంచి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2004లో నిర్మాణం ప్రారంభమై, 2014 నాటికి పూర్తయ్యిందని ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో తేలిందని నివేదిక పేర్కొంది. అప్పటి నుంచి ఈ స్థావరం చురుకుగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. ప్రపంచానికి ఇప్పటివరకు ప్రకటించని 15 నుంచి 20 రహస్య క్షిపణి స్థావరాలలో ఇది ఒకటని వెల్లడించింది.

ఈ స్థావరంలో అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల 6 నుంచి 9 హ్వాసాంగ్-15 లేదా హ్వాసాంగ్-18 రకం శక్తివంతమైన క్షిపణులు ఉండే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వీటిని మొబైల్ లాంచర్ల (TEL) ద్వారా ప్రయోగించవచ్చని, తూర్పు ఆసియా దేశాలతో పాటు అమెరికా ప్రధాన భూభాగానికీ ముప్పు కలిగించే సామర్థ్యం కలిగివున్నాయని హెచ్చరించింది. ముఖ్యంగా, అమెరికా–ఉత్తర కొరియా మధ్య జరిగిన అణ్వస్త్ర నిరాయుధీకరణ చర్చల్లో ఈ స్థావరం ప్రస్తావనే రాలేదని నివేదిక గుర్తించింది.

అత్యవసర పరిస్థితుల్లో ఈ క్షిపణులను భూగర్భ స్థావరాల నుంచి బయటకు తీసుకొచ్చి ముందే సిద్ధం చేసిన ప్రదేశాల నుంచి ప్రయోగించవచ్చని సీఎస్‌ఐఎస్ స్పష్టం చేసింది. ఉత్తర కొరియా క్షిపణి నెట్‌వర్క్‌లో ‘సిన్‌పుంగ్-డాంగ్’ స్థావరం కీలకమైందని, అణు సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూ దాడి శక్తిని విస్తరిస్తున్నదనడానికి ఇది మరో నిదర్శనమని నివేదిక పేర్కొంది.

Read More : పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం తీవ్రం

One thought on “ఉత్తర కొరియా రహస్య క్షిపణి స్థావరం వెలుగులోకి

Comments are closed.