జెరూసలెం: 1967 నుండి ఆక్రమించిన తూర్పు జెరూసలెం, గాజా మరియు ఇతర పాలస్తీనా భూభాగాల నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మంగళవారం సెనెగల్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ సహా 157 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా, హంగరీ సహా 8 దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఉరుగ్వే, పరాగ్వే, జార్జియా, ఈక్వెడార్, చెక్, కామెరూన్ దేశాలు ఓటింగ్ నుంచి దూరంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలికి శాశ్వత శాంతిని స్థాపించాలని ఈ సందర్భంగా భారత్ పునరుద్ఘాటించింది.
గోలనైట్స్ నుంచి ఇజ్రాయెల్ నిష్క్రమించాలని సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన మరో తీర్మానానికి కూడా భారత్ మద్దతు తెలిపింది. 1967 జూన్‌లో సిరియా నుండి గోలనైట్స్ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఈ తీర్మానానికి 97 దేశాలు అనుకూలంగా ఓటు వేసాయి, 64 దేశాలు గైర్హాజరయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇజ్రాయెల్ సహా 8 దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.
ఇక, గాజాలోని నుసీరత్ శరణార్థి శిబిరం సమీపంలో బుధవారం ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు, అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడిన 15 మందిలోనూ ఎక్కువ భాగం చిన్నారులే. మరోవైపు, వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా ప్రజలపై అక్కడ స్థిరపడిన ఇజ్రాయెలీలు దాడులు చేస్తున్నారు.
