ఆర్టీసీ విద్యుత్ బస్సుల వైపు: ప్రకృతి స్నేహి ప్రయాణానికి ప్రణాళిక

ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ బస్సుల వైపు అడుగులు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో డీజిల్ బస్సులన్నీ తొలగించి, వాటి స్థానంలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2024-29 విద్యుత్ వాహనాల విధానం ప్రకారం, 2029 నాటికి ఆర్టీసీ నడిపే మొత్తం బస్సులు విద్యుత్ ఆధారితంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ సమయానికి ఆర్టీసీకి సొంతంగా ఉండే 10,155 బస్సులు, అద్దెపై ఉన్న 2,562 బస్సులు కలిపి మొత్తం 12,717 బస్సులనూ విద్యుత్ ఆధారంగా మార్చే ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం, 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చాలని నిబంధన ఉంది. దీననుసరించి, వచ్చే ఐదేళ్లలో 15 ఏళ్లు దాటిన 2,537 బస్సులను తుక్కుగా మార్చి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను తీసుకురావాలని యోచిస్తున్నారు.

పాత బస్సుల తొలగింపు ప్రణాళిక:

  • 12 లక్షల కిమీ తిరిగిన ఏసీ బస్సులు
  • 10 లక్షల కిమీ నడిచిన సూపర్ లగ్జరీ, అల్ట్రా, డీలక్స్ బస్సులు
  • 8 లక్షల కిమీ ప్రయాణించిన ఎక్స్‌ప్రెస్ బస్సులు
  • 6.5 లక్షల కిమీ నడిచిన తిరుమల ఘాట్ రోడ్డు సర్వీసులు
  • 12 లక్షల కిమీ దాటిన పల్లెవెలుగు బస్సులు
  • 13 లక్షల కిమీ తిరిగిన సిటీ ఆర్డినరీ బస్సులు

ఇలాంటి 5,731 బస్సులను వచ్చే ఐదేళ్లలో పూర్తిగా పక్కనపెట్టనున్నారు.

కొత్తగా విద్యుత్ బస్సుల ఆందరణ:

  • 2029 నాటికి 1,285 అద్దె బస్సులు
  • 2025-29 మధ్య కొత్తగా చేరే 1,698 బస్సులు
  • 2029 నాటికి అదనంగా చేర్చబోయే 2,726 విద్యుత్ బస్సులు

వ్యయ పరిమితి:
విద్యుత్ బస్సుల ఒక్కోటి రూ.1.80 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుండటంతో ఆర్టీసీకి ఇది భారంగా మారే అవకాశం ఉంది. అయితే, బస్సుల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీకి కొంత ఉపశమనం లభించవచ్చు.

ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం:

రాష్ట్రంలోని 11 నగరాలకు ఈ పథకం కింద 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయి. నగరాల వారీగా పంపిణీ ఇలా ఉంది:

  • విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు: 100 చొప్పున
  • అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి: 50 చొప్పున

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం బస్సు కంపెనీలకు ఒక్కో బస్సుకు రూ.35 లక్షల సబ్సిడీ అందిస్తోంది. పుణ్యక్షేత్రమైన తిరుపతికి అదనంగా 300 విద్యుత్ బస్సులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.