ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన పాలనను అంతం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. టెల్ అవీవ్ సమీపంలోని ఓ ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ దాడిలో కనీసం 47 మందికి పైగా గాయపడ్డారని సహాయక బృందాలు వెల్లడించాయి.
ఈ దాడిపై స్పందించిన కాట్జ్, “ఖమేనీ తన బంకర్‌లో దాక్కుని ఆసుపత్రులు, నివాస ప్రాంతాలపై క్షిపణుల దాడులకు పాల్పడుతున్నారు. ఇది యుద్ధ నేరం. ఖమేనీపై ఇజ్రాయెల్ కఠినంగా స్పందిస్తుంది. ఆయన పాలనకు ఇది ముగింపు కావాల్సిన సమయం” అని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధాని నేతన్యాహూ కూడా ఈ విషయంలో సమర్థంగా ఉన్నారని, టెహ్రాన్‌లోని వ్యూహాత్మక కట్టడాలపై దాడులు ముమ్మరం చేయాలని డిఫెన్స్ ఫోర్సెస్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఇదే సమయంలో, ఈ ఆరోపణలను ఇరాన్ స్పష్టం చేస్తూ ఖండించింది. తాము ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని, సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేశామని పేర్కొంది. ఆసుపత్రికి తగిలిన నష్టం పేలుడు తరంగాల ప్రభావమని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇక రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలువురు ఇరాన్ సీనియర్ ఆర్మీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. టెహ్రాన్‌లోని కీలకమైన 50కు పైగా స్థావరాలు ధ్వంసమయ్యాయని వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో, అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఇరాన్ అధికార ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఎప్పుడు లొంగదు, బెదిరింపులకు భయపడదు అని ఖమేనీ స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More : ఫైర్ టెస్ట్‌లో పేలిన స్పేస్ ఎక్స్

One thought on “ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల్లో ఖమేనీపై హెచ్చరిక”
Comments are closed.