వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటన

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించిన నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ట్రినిడాడ్‌ ఆటగాడు తన నిర్ణయాన్ని నిన్న సోష‌ల్ మీడియా వేదికగా ప్రకటించారు. కేవలం 29 ఏళ్ల వయసులోనే తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులు, క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

పూరన్ వన్డేల్లో 61 మ్యాచ్‌లు ఆడి 1,983 పరుగులు సాధించగా, టీ20ల్లో 106 మ్యాచ్‌లతో 2,275 పరుగులు చేసి వెస్టిండీస్ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. 2016లో టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆయన, 2018లో వన్డేల్లో ప్రవేశించారు. 2021 టీ20 ప్రపంచకప్‌కు వైస్-కెప్టెన్‌గా, 2022లో రెండు వైట్ బాల్ ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

తన రిటైర్మెంట్ సందర్భంగా పూరన్ – “వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోని గొప్ప గౌరవం. ఇది ఎన్నో జ్ఞాపకాలతో నిండిపోయిన ప్రయాణం. ఇకపై మైదానంలో లేకపోయినా, వెస్టిండీస్ క్రికెట్‌పై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు” అంటూ భావోద్వేగంగా పేర్కొన్నాడు.

పూరన్ సేవలను కొనియాడిన క్రికెట్ వెస్టిండీస్ – “అతను గేమ్ ఛేంజర్. జట్టుపై అతని ప్రభావం శాశ్వతం. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు” అంటూ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల జరిగిన ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో టీ20 సిరీస్‌కు ఆహ్వానం వచ్చినా, అందుకోకుండా పూరన్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుతానికి ఆయన పూర్తి స్థాయిలో ఫ్రాంచైజీ లీగ్‌లపై దృష్టి పెట్టనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More : టీఎన్‌పీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ తీరుపై వివాదం.

One thought on “వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటన

Comments are closed.