నారా భువనేశ్వరి కొమరవోలు గ్రామస్తులతో భేటీ.. సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ

nara bhuvaneshwari

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ (శుక్రవారం) పామర్రు మండలం దత్తత గ్రామమైన కొమరవోలు ప్రజలతో భేటీ అయ్యారు. గ్రామస్తులను ఆత్మీయంగా పలకరిస్తూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

గ్రామ సమస్యలపై భువనేశ్వరి స్పందన

భువనేశ్వరి గ్రామస్థులతో ముఖాముఖి సమావేశం సందర్భంగా స్థానికులు తమ కష్టాలను వివరించారు. గత ఐదేళ్లుగా రహదారి మరమ్మత్తులు జరగలేదని, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రానివ్వలేదని ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామానికి కష్టకాలంలో అండగా ఉండేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని భువనేశ్వరి స్పష్టం చేశారు.

“నేను మీ భువనమ్మను..”

గ్రామ ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ, “నన్ను మేడం అనొద్దు, నేను మీ భువనమ్మను” అని అన్నారు. కొమరవోలు గ్రామానికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ప్రజల సమస్యలు చిన్నవి కాబట్టి త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు. గ్రామంలో ఏవైనా విభేదాలుంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామస్తులంతా ఒక్కటిగా ఉండాలని, గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

“భువనమ్మను చూస్తే సంతోషంగా ఉంది..”

నారా భువనేశ్వరి గ్రామాన్ని సందర్శించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. “భువనమ్మను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దత్తత తీసుకున్న తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేశారనే సంగతి మర్చిపోలేం” అని కొమరవోలు ప్రజలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి సేవలను తరతరాలు గుర్తుంచుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా భువనేశ్వరికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

Read More