ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) తాజాగా అసాధారణ విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఐదు సీజన్లుగా టైటిల్ దూరంగా ఉండటమే కాక, ఈ సీజన్‌లో కూడా బలహీన ప్రదర్శనతో నిరాశపరిచిన ముంబై.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలిచి రేటులో ఊపిరి పీల్చుకుంది. ఐదింటిలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి నిలిచిన ముంబైకి, ఢిల్లీపై గెలుపు అత్యవసరమైంది. చివర్లో హ్యాట్రిక్ రనౌట్లతో మ్యాచ్‌ను గెలుచుకొని ఆశ్చర్యానికి గురి చేసింది.
మ్యాచ్ చివరి రెండు ఓవర్లకు ఢిల్లీకి 23 పరుగులు అవసరంగా ఉండగా, చేతిలో మూడు వికెట్లు ఉండటంతో ఆ జట్టే గెలిచేలా కనిపించింది. కానీ, బుమ్రా వేసిన ఓవర్‌లో ఆశుతోష్ శర్మ రెండో పరుగుకు యత్నించి రనౌట్ అయ్యాడు. వెంటనే వచ్చిన కుల్దీప్ యాదవ్ కూడా అదే రీతిలో ఔటయ్యాడు. చివరికి మోహిత్ శర్మ కూడా శాంట్నర్ వేసిన డైరెక్ట్ హిట్‌కు రనౌట్ కావడంతో, వరుసగా మూడు రనౌట్లు నమోదు అయ్యాయి. దీంతో ఢిల్లీకి ఓవర్ మిగిలి ఉండగానే పరాజయం పాలైంది.
ఇప్పటికే ముంబై ఇన్నింగ్స్‌లో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ 59 పరుగులతో మెరిశాడు. ముంబై మొత్తం 205/5 స్కోరు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ ధాటిగా ఆడాడు. కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేసిన అతడు ముంబైకి ముప్పుగా మారాడు. కానీ కీలక సమయంలో శాంట్నర్ వేసిన అద్భుత బంతికి వికెట్టు కోల్పోయాడు. ఇది మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.
ఇతర బ్యాటర్లు కేఎల్ రాహుల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (1) అనవసర షాట్లతో విలువైన వికెట్లు కోల్పోవడం ఢిల్లీ విజయం దూరం చేసింది. నాలుగు వరుస విజయాలతో వచ్చిన ఢిల్లీకి ఈ ఓటమే సీజన్‌లో మొదటి పరాజయం కావడం గమనార్హం. ముంబై మాత్రం ఈ విజయంతో అభిమానులకు కొంత ఊరట కలిగించింది. “ఇలా కూడా గెలవొచ్చా?” అనేలా ఆకస్మికంగా మ్యాచ్ గెలిచిన ముంబై.. అభిమానులకు మళ్లీ ఆశలు చూపించింది.

One thought on “హ్యాట్రిక్ రనౌట్లతో ముంబై అద్భుత విజయం!”
Comments are closed.