మోదీ చైనా పర్యటన: ఏడేళ్ల తర్వాత కీలక శిఖరాగ్ర సదస్సు

ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు. అమెరికాతో భారత సంబంధాల్లో విరామం ఏర్పడిన ఈ సమయంలో జరగబోయే ఈ పర్యటన అంతర్జాతీయంగా విశేష దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెలాఖరులో ఆయన జపాన్‌, చైనా దేశాల్లో నాలుగు రోజులపాటు అధికారిక పర్యటన చేస్తారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదం చేయనుంది. షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో మోదీ చైనాలో పర్యటించనున్నారు. తియాన్‌జిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. 2018లో కింగ్‌డావోలో జరిగిన ఎస్‌సీవో సమావేశం అనంతరం మోదీ చైనాకు వస్తున్నది ఇదే తొలిసారి. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సహా పలు దేశాల నేతలు పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచుకునే ఈ తరుణంలో ఈ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా జపాన్‌కి వెళ్తారు. ఆగస్టు 29, 30 తేదీల్లో అక్కడి ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఆయన పర్యటిస్తారు. ఇది మోదీకి 8వ జపాన్ పర్యటన కాగా, ఇషిబా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగే తొలి భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశం కావడం ప్రత్యేకత.

15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై కూడా ఇరు దేశాల నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఈ పర్యటనతో భారత్-జపాన్ స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడనున్నాయని భావిస్తున్నారు.

Read More : దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు